తితిదే ఛైర్మెన్‌గా వైవీఎస్ పదవీకాలం ముగిసింది.. చివరి సమావేశంలో కీలక నిర్ణయాలు..
సోమవారం, 7 ఆగస్టు 2023 (16:14 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మెన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం సోమవారంతో ముగిసింది. ఆయన రెండు దఫాలుగా అంటే నాలుగేళ్లపాటు తితిదే ఛైర్మన్‌గా ఉన్నారు. ఇపుడు ఆ పదవికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో పాత పాలక మండలి సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా, వీటికి పాలక మండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టిటిడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
పాలకమండలి ఆమోదించిన అంశాలివే..
రూ.4 కోట్లతో అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు భక్తుల సౌకర్యార్థం షేడ్లు ఏర్పాటు.
రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల కోసం మరమ్మతు పనులు.
రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు.
రూ.4.5 కోట్లతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణ.
రూ.23.50 కోట్ల వ్యయంతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లేక్స్ నిర్మాణం.
శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయింపు.
రూ.3.10 కోట్ల వ్యయంతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులకు ఆమోదం.
రూ.9.85 కోట్లతో వకుళమాత ఆలయం వద్ద అభివృద్ధి పనులుకు నిధుల కేటాయింపు.