హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫసీయుద్దీన్(35) వ్యాపారి. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ మూడేళ్లలో 28 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడు. మంగళవారం ఆర్జీఐఏ ట్రాఫిక్ ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో కిషన్‌గూడ పైవంతెన వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అతని వాహనాన్ని ఆపారు. దానికున్న పెండింగ్ చలాన్లను పరిశీలించగా రూ.9,110 జరిమానా ఉన్నట్లు తేలింది.
ఈ చలాన్లు చెల్లించి వాహనం తీసుకెళ్లాలని సూచించిన పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ఫసీయుద్దీన్ తన వాహనం పెట్రోల్ ట్యాంక్ తెరిచి నిప్పంటించడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు మంటలను ఆర్పివేశారు. ఫసీయుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఆర్జీఐఏ పోలీసులు తెలిపారు.