దొడ్లోకొచ్చిన గేదె పెంటపెట్టదా అన్నట్టుగా ఇపుడు మీ ముందర నిలబెట్టాడు..

గురువారం, 10 డిశెంబరు 2020 (17:35 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. హరీష్ రావు ఓ ఆణిముత్యం అన్నాడు. ఈ పిల్లోడు చాలా మంచోడన్నారు. తన ప్రాణం లాంటి సిద్ధిపేటను ఆ పిల్లోడి చేతుల్లో పెడితే.. తనకంటే బాగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడని, ఇది చూసి చాలా సంతోషంగా ఉందన్నారు.
 
గురువారం సిద్ధిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. 
 
సిద్ధిపేట పేరులోనే ఏదో బలం ఉంది అని సీఎం అన్నారు. ఇది మాములు పేట కాదన్నారు. ఎందుకంటే ఇది సిద్ధి పొందినటువంటి పేట అని ప్రసిద్ధి. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదని సీఎం అన్నారు. 
 
ఆనాడు అవసరం రీత్యా కరీంనగర్‌ ఎంపీగా, సిద్ధిపేట ఎమ్మెల్యేగా పోటీచేస్తే రెండింటిలో గెలిచాం. కానీ తెలంగాణ కోసం ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ కోసం నడుం కట్టి మిమ్మల్ని అందరినీ వదిలి అక్కడికి పోయిన. మీ పేరు నిలబెట్టి తెలంగాణ తెచ్చి ప్రజల చేతుల్లో పెట్టినం.
 
తెలంగాణనే కాదు మన సిద్దిపేటకు నా అంత పనిచేసే మనిషి కావాలని చెప్పి మంచి ఆణిముత్యంలాంటి నాయకుడిని హరీశ్‌రావు మీకు అప్పగించా. నా పేరు కాపాడి అద్భుతమైన సిద్దిపేట తయారు చేసిండు. ఇది తన గుండెల నిండా సంతోషం నింపే అంశమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 
 
గతంలో సిద్ధిపేట ప్రజలు చుక్క నీటి కోసం ఎంతో ఇబ్బంది పడ్డారని, కానీ ఇప్పుడు సిద్ధిపేటలో అమలు చేస్తున్న మంచినీటి విధానమే రాష్ట్రమంతా మిషన్ భగీరథ పేరుతో అమలవుతోందని అన్నారు.
 
అంతేకాకుండా, సిద్ధిపేటలో చేపట్టిన అభివృద్ధి పనులను రిబ్బిన్ కత్తిరించి ప్రారంభిస్తే చాలని హైదరాబాద్‌లో చెప్పాడనీ, కానీ ఇపుడు మీ ముందుర నిలబెట్టి అనేక పనులు చేయాలని కోరాడని చెప్పారు. అంటే.. దొడ్లోకొచ్చిన గేదె పెంటపెట్టదా అన్నచందంగా ఉందన్నారు. దీంతో సభలోని ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వారు. 
 
అంతకుముందు నర్సాపూర్ శివారులో నిర్మించిన 2,461 డబుల్ బెడ్రూం ఇళ్లలో మొదటి దశలో భాగంగా 144 మంది లబ్ధిదారులతో నేడు సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. 9వ బ్లాక్‌లోని 3వ నంబరు నివాస గృహంలో లబ్ధిదారుడితో కేసీఆర్ దగ్గరుండి గృహప్రవేశం చేయించారు. 
 
అలాగే, పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. మెడికల్‌ కళాశాల, రంగనాయకసాగర్‌ అతిథిగృహం, సిద్దిపేటలో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంట్, రైతు వేదికలను ప్రారంభించారు. 
 
వెయ్యి పడకల ఆసుపత్రి, ఐటీ టవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు