ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలకు రుసుములను రద్దు చేస్తూ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త చెప్పింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలకు రుసుములను రద్దు చేసిన హెచ్డీఎఫ్‌సీ.. చెక్ బుక్ జారీ, లావాదేవీల చార్జీలను కూడా సవరించింది.
తమ ఖాతాదారులు ఇక నెఫ్ట్, ఆర్‌టీజీఎస్‌లను ఉచితంగా జరుపుకోవచ్చునని.. ఈ విధానం ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ బ్యాంకులో సేవింగ్, శాలరీ అకౌంట్లు ఉన్న వారందరికీ ఇవి వర్తిస్తాయని ప్రకటన చేసింది.
అదేవిధంగా, చెక్ ఆధారిత లావాదేవీలు, రికవరీ సవరణ ఛార్జీలను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని బ్యాంకు వెల్లడించింది. గతంలో రెండు లక్షల లోపు ఆర్‌టీజీఎస్ లావాదేవీలు జరిపితే రూ.25 రుసుం వసూలు చేసేది. అలాగే రూ.2 నుంచి రూ.5లక్షలపై రూ.50 విధించేది.