కర్ణాటక ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా భాజపాకి బుద్ధి రాలేదు: కేసీఆర్

శనివారం, 27 మే 2023 (18:54 IST)
భాజపాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందనీ, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధీనంలో పనిచేయకుండా ఆర్డినెన్స్ తెచ్చి ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆరోపించారు. ఆర్డినెన్స్ విషయమై సుప్రీంకోర్టు సైతం తప్పని చెప్పినా భాజపా పట్టించుకోవడం లేదన్నారు.
 
ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్డినెన్సును ఉపసంహరించుకునే వరకూ తాము పోరాడతామన్నారు. ఈ విషయమై మద్దతు కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ శనివారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి అరవింద్ కేజ్రీవాల్ అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నారనీ, ఐతే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. గవర్నర్లు భాజపా స్టార్ క్యాంపెయినర్లుగా మారారనీ, కర్నాటక ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా భాజపాకి బుద్ధి రాలేదని అన్నారు. త్వరలోనే భాజపాకి దేశం యావత్తు గుణపాఠం చెబుతుందని అన్నారు కేసీఆర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు