ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఠాగూర్

సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (17:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్ల మేరకు నిధులు కేటాయించినట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపాు. గత యూపీఏ హయాంలో కంటే ఇపుడు 11 రెట్లు అధికంగా ఈ నిధులు ఉన్నాయని తెలిపారు. ఇదే అంశంపై ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఏపీలో మొత్తం రూ.84,559 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. 
 
రాష్ట్రంలో కొత్తగా 1,560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు వేశాం. రైల్వే పనులు వేగంగా జరిగేలా అక్కడి సీఎం సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందే భారత్‌ రైళ్లు తిరుగుతున్నాయి. ఏపీకి మరిన్ని వందే భారత్‌ రైళ్లు కేటాయిస్తాం. అన్ని రైళ్లు 110 కి.మీ వేగంతో వెళ్లేలా ట్రాక్‌లు సిద్ధం చేస్తున్నాం. కొన్ని రూట్లలో 130 కి.మీ, 160 కి.మీ వేగంతో వెళ్లేలా ట్రాక్‌లు ఏర్పాటు చేస్తాం. ఏపీలో ఇప్పటికే అనేక రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని.. అందుకే ఏపీ రైల్వే ప్రాజెక్టుల గురించి బడ్జెట్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదని అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు.
 
మరోవైపు, తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్‌ రైళ్లు నడుపుతామని ఆయన తెలిపారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతోందన్నారు. 
 
'ఇటీవల స్విట్జర్లాండ్‌ వెళ్లి అక్కడి రైల్వే ట్రాక్‌లను పరిశీలించాం. రైల్వే ట్రాక్‌ల నిర్వహణలో స్విట్జర్లాండ్‌ వ్యవస్థను పాటిస్తున్నాం. వందే భారత్‌ ట్రైన్లలో స్లీపింగ్‌ సీట్లపై ట్రయల్‌ జరుగుతోంది. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్‌ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో 1,326 కి.మీ మేర ప్రస్తుతం కవచ్ టెక్నాలజీ ఉంది. మరో 1,026 కి.మీ.మేర ఈ టెక్నాలజీ ఏర్పాటు చేస్తున్నాం. 
 
2026లోపు దేశమంతా కవచ్‌ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తాం. సికింద్రాబాద్‌లో కవచ్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తాం. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. పేద వర్గాల కోసం నమో భారత్‌ రైళ్లను నడుపుతున్నాం. త్వరలో దేశమంతా దాదాపు 100 నమో భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు తీసుకురానున్నాం. ఈ రైళ్ల ద్వారా పేద ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందనున్నారు' అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు