గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు. రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి ఈయన గెలుపొందారు. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినప్పటికీ.. రాపాక మాత్రం వైకాపా ఫ్యాను గాలి స్పీడును తట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన జనసేనతో అంటీఅంటనట్టుగా ఉంటూ వచ్చారు. అదేసమయంలో అధికార వైకాపాకు దగ్గరవుతూ వచ్చారు.
అసెంబ్లీ సమావేశాల్లోను ప్రతిపక్ష సభ్యుడి హోదాలో అధికార పార్టీని పొగుడుతూ ప్రసంగాలు చేశారు. దీంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపాక ఏ పార్టీలో ఉన్నారో ఆయనే చెప్పాలని కూడా వ్యాఖ్యానించారు. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా వైసీపీకి ఓటేయడంతో జనసేనతో కటీఫ్ అని తేలిపోయింది. వైకాపాకు ఓటు వేయడం ద్వారా ఆయన తాను వైకాపా వైపు ఉన్నట్టు స్పష్టం చేసినట్టయింది.