తమిళనాడులో జూన్ నెల - ఆంధ్రాలో జూలై నెలలో టెన్త్ పరీక్షలు

మంగళవారం, 12 మే 2020 (16:16 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రతి వ్యవస్థా అతలాకుతలమైంది. ముఖ్యంగా విద్యాసంవత్సరం గాడితప్పింది. ఇప్పటికే పూర్తి కావాల్సిన పలు పబ్లిక్ పరీక్షలు ఇంకా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అలాగే, అనేక జాతీయ ప్రవేశ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. 
 
ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తమిళనాడు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులోభాగంగా, తమిళనాడులో జూన్ నెలలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యామంత్రి కేఏ సెంగోట్టయ్యన్ తెలిపారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జూలై నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇదే అంశంపై ఏపీ విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జూలై నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 
 
పరీక్షల షెడ్యూల్‌ను వారంలో విడుదల చేస్తామన్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు, సిబ్బందికి సమస్యలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల మధ్య కనీసం 4 అడుగుల భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నామన్నారు. 
 
ఒక్కో గదిలో 12 నుంచి 15 మంది మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది అందరికీ మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటుచేసేలా చూడాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా, ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఏ ఒక్కరు కూడా కరోనా వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు