ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం గ్రూపు-2 మెయిన్స్ రాత పరీక్ష ఆదివారం జరిగింది. ఈ పరీక్షను నిర్వహించరాదంటూ అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు చేసిన ఆందోళనలను ఏపీపీఎస్సీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ముందుగా ప్రకటించినట్టుగానే ఈ పరీక్ష ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు రాసేందుకు ఓ యువతి పెళ్లి దుస్తుల్లోనే పరీక్షా కేంద్రానికి వచ్చి పరీక్షరాసి వెళ్లింది.
మరోవైపు, ఈ గ్రూపు-2 పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అయితే, ఏపీపీఎస్సీ మాత్రం వీరి విన్నపాలు, ఆందోళనను ఏమాత్రం పట్టించుకోలేదు. విశాఖ జాతీయ రహదారిపై విద్యార్థులు ఆందోళన చేశారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని మోసం చేశారంటూ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారంతా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
అయితే, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్యాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేస్తూ ఈ పరీక్షను యధావిధిగా నిర్ణయించింది.