“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి: చంద్రబాబు

బుధవారం, 17 జనవరి 2018 (21:37 IST)
న్యూ ఢిల్లీ : “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా వుందని, పారిశ్రామిక మౌలిక రంగాలలో పెట్టుబడులకు విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. 2018 ఫిబ్రవరి 24-26 తేదీలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ సదస్సుకు సన్నాహకంగా న్యూఢిల్లీ లోని తాజ్ హోటల్‌లో వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు, రాయబారులతో బుధవారం ఏర్పాటు చేసిన Curtain raiser సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభుతో కలసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక లోటుతో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడిపోయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామికీకరణ, వ్యవసాయరంగాలలో రెండంకెల అభివృద్ధిని సాధిస్తున్నదని అన్నారు. గడచిన 3 ½ సంవత్సరాలలో 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 10.99శాతం, 2016-17 ఆర్ధిక సంవత్సరంలో 11.61శాతం,  2017-18 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు 11.37 శాతం అభివృద్ధి గణాంకాలను నమోదు చేసిందని, ఇదేకాలంలో కేంద్ర ప్రభుత్వం 7.6 శాతం, 7.1 శాతం, 5.1 శాతం అభివ్రుద్స్ది రేటును సాధించిందని, ఇందుకు కారణం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విజన్ డాక్యుమెంట్ ప్రధాన కారణమని ఆయన విశదీకరించారు.
 
గత 24 సంవత్సరాల సి ఐ ఐ సదస్సులలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆరు సార్లు ఆతిధ్యము ఇవ్వగా నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా గత మూడు సంవత్సరాల నుంచి ఈ సదస్సులకు ఆతిధ్యమివ్వడం సంతోషంగా వున్నదని అన్నారు. ఈనేపధ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, వనరులను వివరిస్తూ ప్రపంచం నలుమూలల వివిధ దేశాలలో పర్యటించి పారిశ్రామిక వేత్తలతో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రష్యా, చైనా, జపాన్, సింగపూర్, దావోస్ వంటి దేశాలలోని పారిశ్రామిక వేత్తలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం శుభ పరిణామం అని అన్నారు.
 
వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నదని, గుజరాత్ రాష్ట్రం తరువాత కార్గో రంగంలో పెట్టుబడులకు ఈతీర ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుందని చెప్పారు. విశాఖపట్నం – చెన్నై, చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లు ప్రధానంగా పారిశ్రామిక పెట్టుబడులకు ఎంతో అనువుగా తీర్చిదిద్దామని చెప్పారు.  ఈ కారిడార్ లో ఇప్పటి వరకు 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 973 ప్రాజెక్టులను ఏర్పాటు చేసి 24 లక్షల మందికి ఉద్యోగ, ఉపాది అవకాశాలను కల్పించినట్లు చెప్పారు. వైద్య రంగంలో వస్తున్న వినూత్నమైన మార్పులకు అనుగుణంగా వైద్య పరికరాల తయారి రంగం ఆంధ్ర ప్రదేశ్ అనువుగా వున్నదని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టుటకు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
 
రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పరిపాలన, సంక్షేమ రంగాలలో విస్తృతమైన అవకాశాలను పెంపొందిస్తున్నట్లు చెప్పారు.  నూతన సాంకేతికతను వినియోగిస్తూ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రతి గృహానికి 149 రూపాయలకే ఇంటర్నెట్, టెలిఫోన్, టివి ద్వారా 3 వందల శాటిలైట్ చానల్స్‌ను చూసే అవకాశాన్ని కల్పించడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే దక్కిందని అన్నారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా ౩ వేల 5 వందల ఎకరాల భూమిని సమకూర్చడం ముదావహం అన్నారు. అమరావతి గ్రీన్ ఫీల్డ్ కాపిటల్ సిటి ఏర్పాటు, క్లీన్ & గ్రీన్ బ్లూ సిటీ ఏర్పాటు, ఎలక్ట్రిక్ వాహానాల రవాణాకు ఎంతో అనువుగా నిర్మాణాలతో నూతన రాజధానిని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు