కాలేజీ రోజుల్లో బ్రష్ చేతపట్టి గోడల మీద 'విశాఖ ఉక్కు సాధిస్తాం' అని రాశాం.. చిరంజీవి

బుధవారం, 10 మార్చి 2021 (21:15 IST)
విశాఖ ఉక్క కర్మాగారాన్ని ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఈ క్రమంలో ఉక్కు ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్న వారికి తాను కూడా మద్దతు ప్రకటిస్తున్నానని సినీ నటుడు చిరంజీవి అన్నారు. 
 
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పారు. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతపట్టి, గోడల మీద 'విశాఖ ఉక్కు సాధిస్తాం' అనే నినాదాన్ని రాశామని తెలిపారు. 
 
ధర్నాలు, హర్తాళ్లు, రిలే నిరాహార దీక్షలు చేశామని చెప్పారు. దాదాపు 35 మంది పౌరులతో పాటు ఒక తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నామని గుర్తుచేశారు.
 
విశాఖ ఉక్కుకు దేశంలోనే ఒక ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించామని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్ని సంవత్సరాలుగా క్యాప్టివ్‌మైన్స్ కేటాయించకపోవడం దారుణమన్నారు. నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటు పరం చేయాలనుకోవడం సరికాదని చెప్పారు. 
 
ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడిని ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నానని అన్నారు. ఉద్యోగస్తులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాలను గౌరవించి తన నిర్ణయాన్ని కేంద్రం పునఃసమీక్షించుకోవాలని కోరారు. 
 
విశాఖ ఉక్కును రక్షించుకోవడం ప్రస్తుతం మనందరి ముందున్న ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ఇది పార్టీలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయసమ్మతమైన హక్కు అని... ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకోవాలని చెప్పారు. కాగా, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు