వరద ముంపులో ప్రసవించిన మహిళ.. చలించిన పోలీస్ కమిషనర్... స్వయంగా వెళ్లి...

ఠాగూర్

మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (18:06 IST)
విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌ నగర్‌ మూడు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ క్రమంలో సింగ్‌నగర్‌ డాబాకొట్ల సెంటర్‌ వద్ద వరద ముంపులోనే ఓ ఇంట్లో మహిళ ప్రసవించింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు స్వయంగా బోటులో వెళ్లి తల్లీబిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు. అప్పుడే పుట్టిన బిడ్డను సురక్షితంగా తీసుకొచ్చిన అధికార యంత్రాంగానికి ప్రజలు అభినందనలు తెలిపారు. 
 
ఇదిలావుంటే, వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా క్రమంగా పునరుద్ధరిస్తున్నారు. అయితే, ఈ పనుల్లో ఓ అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న కోటేశ్వర రావు అనే విద్యుత్ లైన్‌మెన్ వరద నీటి ప్రవాహానికి కొట్టుకునిపోయి ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సానుభూతిని తెలిపారు. భార్య మాధవి, కుటుంబ సభ్యులకు ఆయన ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. లైన్‌మెన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగర సమీపంలోని బుడమేరు ఉప్పొంగి అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు