ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా బాగా చర్చనీయాంశంగా మారిన విషయం ''రేషన్ బియ్యం స్మగ్లింగ్.'' పేదల కోసం ప్రభుత్వాలు పంపిణీ చేసే ఈ ఉచిత బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతోంది. కాకినాడ పోర్టు కేంద్రంగా వేల టన్నుల పీడీఎస్(ప్రజా పంపిణీ వ్యవస్థ) బియ్యం నౌకల ద్వారా విదేశాలకు తరలిపోతోందంటూ స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందునుంచీ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక ఇటీవల ఓ నౌకను తనిఖీ చేసి అందులో తరలించేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని పరిశీలించినప్పటి నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై రాష్ట్రంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పేదలకు పంచే ఈ బియ్యం అక్రమ రవాణా మూలాల శోధన కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది.
బ్లాక్‌మార్కెట్‌కి తరలిపోతున్న రేషన్ బియ్యం ఎంత?
కోవిడ్‌కి ముందు రేషన్ బియ్యం ధర కేజీ రూపాయి ఉండగా, కరోనా నుంచి ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. పైగా గత కొద్దికాలంగా సార్టెక్స్ మెషీన్లు వచ్చిన తర్వాత నూక, మట్టి, చిన్నచిన్న రాళ్లను తొలగించి పోర్టిఫైడ్ బియ్యం కలిపి ఇస్తున్నారు. దీంతో చాలామంది పేదలు, చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు, కార్మికులు ఇదే బియ్యాన్ని వినియోగిస్తున్నారు. ''మాకు ముగ్గురు పిల్లలు. అందరూ పెద్దవాళ్లయి వేరే ఊళ్లలో ఉంటున్నారు. నేను, నా భార్య రేషన్ బియ్యమే తింటున్నాం. బాగానే ఉంటోంది'' అని ఏలూరు రూరల్ మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన రైతు కోన భుజంగరావు చెప్పారు. ''ప్రస్తుతం స్వర్ణరకం బియ్యం పంపిణీ చేస్తున్నారు. నాణ్యత ఫర్వాలేదు. నేను, నా కుటుంబం ఆ బియ్యమే వండుకుతింటాం. అయితే, కేజీకి 43 రూపాయలకి పైగా ఖర్చు చేస్తున్న పాలకులు మరింత నాణ్యమైన బియ్యం పంపిణీ చేయొచ్చు'' అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేత శ్రీనివాసరావు బీబీసీతో అన్నారు.
అయితే, బియ్యం కోసం కాకుండా కేవలం ప్రభుత్వ పథకాల కోసమే తెల్లరేషన్ కార్డులు పొందుతున్న వారు మాత్రం ఆ బియ్యాన్ని అమ్మేస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు. ''ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇప్పటికీ తెల్లరేషన్ కార్డే ప్రామాణికం. తెల్లకార్డు లేదంటే ఆరోగ్యశ్రీ రద్దయిపోతుందనే ఆందోళన చాలామంది లబ్ధిదారుల్లో ఉంది. చాలా పథకాలకు రేషన్ కార్డుతో సంబంధం లేదని అధికారులు చెబుతున్నా అంతిమంగా ఆ కార్డునే లెక్కలోకి తీసుకుంటున్నారు'' అని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. బియ్యం తీసుకోపోతే కార్డు రద్దవుతుందనే భయంతోనే చాలామంది లబ్ధిదారులు తెల్లరేషన్ కార్డులు పొందుతున్నారని, ఇది అంతిమంగా బియ్యం బ్లాక్‌మార్కెట్‌కి తరలిపోవడానికి కారణమవుతోందని లక్ష్మణరెడ్డి అభిప్రాయపడ్డారు.
బియ్యం స్మగ్గింగ్ ఎలా జరుగుతోందంటే..
రేషన్ బియ్యంతోనే అన్నం వండుకునే వాళ్లతో పాటు వాటిని అన్నానికి కాకుండా ఇతరత్రా (దోశల్లో వాడేందుకు, బియ్యపు పిండి చేసేందుకు, కోళ్లకి దాణా వేసేందుకు) వినియోగించే వాళ్లు బియ్యాన్ని అమ్ముకోవడం లేదు. ''రేషన్ బియ్యం తీసుకునే వాళ్లలో సుమారు సగం మంది వాటిని అమ్ముకుంటున్నారని అంచనా. హోటళ్లకు కిలో 15 రూపాయల నుంచి 18 రూపాయల మధ్య అమ్మేస్తుంటారు. కొంతమంది వీధి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. వీరు కేజీకి 18 నుంచి 20 రూపాయల వరకు ఇస్తారని చెబుతున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని వాళ్లు దళారులకు 25 రూపాయలకు అమ్ముతారు.
ఆ దళారులు పెద్దమొత్తంలో బియ్యాన్ని పోగు చేసి క్వింటాళ్ల లెక్కన తిరిగి రైస్ మిల్లులో రీసైక్లింగ్ (పాలిష్ పట్టి సన్నబియ్యంగా మార్పించడం) చేయిస్తారు. లేదంటే నేరుగా కాకినాడ పోర్టుకే తరలించేస్తారు'' అని నిడదవోలు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ ఒకరు బీబీసీకి చెప్పారు. ఆయన తన పేరు వెల్లడించేందుకు ఇష్టపడలేదు. ''రేషన్ బియ్యం సిండికేట్లు ఎంతబలంగా ఉంటాయంటే...ఆ సిండికేట్ నేతలు ఎవరినైనా ప్రభావితం చేయగలరు. అందరికీ అందాల్సిన వాటాలు అందుతాయి. రేషన్ డీలర్ పాత్ర చాలా చిన్నది. పైగా ఎండీయూ ఆపరేటర్లు వచ్చిన తర్వాత డీలర్లు నామమాత్రమై పోయారు. పైకి కనిపించని వందల కోట్ల సామ్రాజ్యమిది.'' అని ఆ డీలర్ బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.
ఇలా తీసుకుని.. అలా అమ్మేసి..
ఇటీవల చాలామంది లబ్ధిదారులు మొబైల్ డిస్పెన్సరీ యూనిట్(ఎండీయూ) ఆపరేటర్ వద్దనే అమ్మేస్తున్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి బియ్యం పంపిణీ విధానంలో మార్పులొచ్చాయి. రేషన్ డీలర్ స్టాకిస్ట్‌గా వ్యవహరిస్తారు. డీలర్ మండల లెవెల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ నుంచి తన డీలర్‌షిప్ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన బియ్యం (ఇండెంట్) తీసుకుని స్టాక్ కేంద్రానికి తరలిస్తారు, అక్కడి నుంచి ఎండీయూ ఆపరేటర్ బియ్యాన్ని తీసుకుని లబ్ధిదారుల వద్దకి వెళ్లి అందజేస్తారు.
''ఈ క్రమంలో పంచదార, కందిపప్పు తీసుకుంటున్న లబ్ధిదారుల్లో చాలామంది బియ్యం మాత్రం తిరిగి ఆపరేటర్‌కే ఇచ్చేస్తున్నారు. కేజీకి 15 రూపాయల చొప్పున అతనికే విక్రయించేస్తున్నారు. సదరు ఆపరేటర్ తిరిగి ఆ బియ్యాన్ని దళారులకు అమ్ముకోవడం, అక్కడి నుంచి రైస్ మిల్లులకో లేదా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకో తరలిపోతోంది'' అని ఆ డీలర్ చెప్పారు. ఇదంతా గోదావరి జిల్లాల్లోని డీలర్లలో చాలామందికి తెలిసిన విషయమేనని, ఇందులో దాపరికం ఏమీలేదని ఆయన బీబీసీతో చెప్పారు. ఇదే విషయమై ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ బీబీసీతో మాట్లాడారు. ఎండీఎస్ వాహనాల వద్దనే పీడీఎస్ బియ్యం అమ్ముకుంటున్నారనే విషయం మా వరకూ వచ్చింది. దానిని నియంత్రించేందుకు వాహనాల వద్ద రేషన్ బియ్యం పంపిణీ చేసే వ్యవస్థను ఎత్తేయాలని యోచిస్తున్నాం. ఇది ఆలోచన మాత్రమే. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాం అని ఆయన అన్నారు.
'స్మగ్లింగ్ అనడం సరికాదు'
''బియ్యం స్మగ్లింగ్ అనే పదం సరికాదు. 1246, ఎస్‌ఎల్‌టి ధాన్యం రకాలను రైతులు పండించినా ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్లు కొనుగోలు చేయడం లేదు. అవి తక్కువ కాలంలో దిగుబడి వచ్చే పంటలు. వాటిని ప్రభుత్వ సంస్థలు కొనకపోవడంతో రైతులు మిల్లర్లకి అమ్ముకుంటే మిల్లర్లు వాటిని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు'' అని కొవ్వూరుకి చెందిన ఓ రైస్ మిల్లు యజమాని బీబీసీతో అన్నారు. ''వాటిని విదేశాల్లో బాగానే తింటారు. 80 శాతం ఆ బియ్యమే ఎగుమతి చేస్తారు. దాని మాటున 20 శాతం రేషన్ బియ్యం కూడా కొంత వెళ్లొచ్చు. అది కూడా దళారులు కొనుక్కున్న బియ్యమే. దానిని స్మగ్లింగ్ అనడం సరికాదు.'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
''రేషన్ బియ్యం దందా ఏపీలో కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. అసలు ఈ దందా ఆగాలంటే ప్రభుత్వం ముందుగా నాణ్యమైన రేషన్ బియ్యం ప్రజలకు అందించాలి. ప్రజలు తినగలిగే బియ్యం అందించినప్పుడు వాళ్లు ఎందుకు అమ్ముకుంటారు'' అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ''ఉచిత రేషన్ బియ్యం కొనేవారిపై ముందుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలా చేస్తే ఈ దందాకు కొంత అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నాం. రేషన్ బియ్యం కొనేవాళ్లే లేకుంటే ఆ బియ్యాన్ని కచ్చితంగా లబ్ధిదారులే వాడుకుంటారు. ఇక పీడీఎస్ బియ్యం నాణ్యతపై లబ్ధిదారులందరికీ అవగాహన కలిగించే కార్యక్రమాలు ఊరూరా చేపట్టాలని నిర్ణయించాం'' అని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ బీబీసీతో చెప్పారు.
అలాగే, కాకినాడ పోర్టుతో పాటు రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల వద్ద కూడా బియ్యం స్మగ్లింగ్ అడ్డుకట్టకు మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, గడచిన ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఒక్క కాకినాడ జిల్లాలోనే బియ్యం అక్రమ రవాణాపై 19 కేసులు నమోదు చేశామని కాకినాడ డీఎస్‌వో ప్రసన్న లక్ష్మీ దేవి బీబీసీతో చెప్పారు