కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్‌డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది, మళ్లీ విధిస్తారా'

గురువారం, 15 ఏప్రియల్ 2021 (16:59 IST)
"లాక్‌డౌన్ మళ్లీ విధిస్తారా?"
ముంబయిలోని ఓ చిన్న గదిలో ఉంటున్న సేథీ సోదరులు గత వారం వీడియో కాల్‌లో మాట్లాడుతూ పదే పదే ఇదే ప్రశ్న అడిగారు. వారి గొంతు వణుకుతోంది. సంతోష్ సేథీ, టున్నా సేథీ సోదరులు ఒడిశాలోని తమ ఊరికి 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబయి నగరానికి జీవనోపాధి వెతుక్కుంటూ వచ్చి దశాబ్దం దాటిపోయింది.

 
వీరిద్దరూ ముంబయి నగరంలో భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పని చేస్తున్నారు. రోజంతా 8 గంటల పాటు పని చేసి సిమెంటు, ఇటుకలు, రాళ్ల లాంటివి మోస్తూ రోజుకు 450 రూపాయిలు సంపాదించేవారు. వారు నిర్మాణంలో ఉన్న కాంక్రీటు భవనాల నీడలోనే నివాసం ఉంటూ అక్కడే తింటూ మిగిలిన డబ్బును ఊర్లో కుటుంబం ఖర్చుల కోసం పంపించేవారు.

 
భారతదేశంలో ఉన్న 40.5 కోట్ల మంది వలస కార్మికుల్లో 6 కోట్ల మంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే ఉంటారని 'ఇండియా మూవింగ్: ఏ హిస్టరీ ఆఫ్ మైగ్రేషన్‌' రచయత చిన్మయి టుంబే పేర్కొన్నారు. భారతీయ నగరాల అసంఘటిత రంగ అభివృద్ధికి వీరు వెన్నెముక లాంటి వారు. భారతదేశపు స్థూల జాతీయ ఉత్పత్తిలో వీరి వాటా 10 శాతం ఉన్నప్పటికీ వారు సామాజికంగా, రాజకీయంగా దీన పరిస్థితిలోనే ఉంటారు" అని ప్రొఫెసర్ టుంబే అంటారు.

 
మరో వైపు ముంబయిలో ఉన్న సేథీ అన్నదమ్ములకు తిరిగి భయం మొదలయింది. వారు "తిరిగి మేము ఇంటికి వెళ్లిపోవాలా? లాక్ డౌన్ గురించి మీ దగ్గరేమైనా సమాచారం ఉందా" అని నన్ను ప్రశ్నించారు. మహారాష్ట్ర రాజధాని ముంబయి కోవిడ్ కేసులకు కేంద్రంగా మారి ఇప్పటికే రాష్ట్రంలో 30 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టని పక్షంలో మరో లాక్ డౌన్ విధించడం తప్ప మరో మార్గం లేదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఏప్రిల్ నెలాఖరు వరకు అత్యవసర సేవలు, ప్రయాణాలను మాత్రమే అనుమతిస్తూ మంగళవారం కొన్ని కొత్త నిబంధనలను కూడా ప్రకటించింది. నిర్మాణ స్థలం దగ్గరే ఉండి పని చేసేటటువంటి కార్మికులు ఉన్న చోట్ల మాత్రమే నిర్మాణ రంగ పనులు కొనసాగడానికి అనుమతినిచ్చింది.

 
గత సంవత్సరం ప్రణాళిక లేకుండా విధించిన లాక్ డౌన్ వల్ల కోటి మందికి పైగా వలస కార్మికులను నగరాలను వదిలిపెట్టి వెళ్లేలా చేసింది. కొన్ని వేల మంది మహిళలు, పురుషులు కాలి నడకన, సైకిళ్ళ పైన, ట్రాక్ల మీద తర్వాత రైళ్ల లోనూ తమ ఊళ్లకు ప్రయాణమయ్యారు. అందులో 900 మంది మార్గమధ్యంలోనే చనిపోయారు. ఈ భారీ వలస 1947లో భారత పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన లక్షలాది మంది శరణార్ధుల కష్టాలను జ్ఞప్తికి తీసుకుని వచ్చింది.

 
"చాలా మంది భారతీయులు వారి జీవితకాలంలో చూసిన అతి పెద్ద మానవ సంక్షోభం ఇదే అయి ఉంటుందని", మానవ హక్కుల కార్యకర్త హర్ష మందెర్ అన్నారు. ముంబయిలో కోవిడ్ కేసుల సంఖ్య తిరిగి పెరుగుతోంది. గత ఏడాది లాక్ డౌన్ జ్ఞాపకాలు సేథీ అన్నదమ్ములను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది ఆగిపోయిన పనులు, స్తంభించిన రవాణాతో వారు రెండు నెలల పాటు ముంబయిలోనే ఉండిపోవలసి వచ్చింది. దాంతో, వారు అన్నం కోసం అడుక్కోవాల్సి వచ్చింది.

 
"అది చాలా దారుణమైన అనుభవం. అదొక చిత్రమైన పరిస్థితి" అని 43 సంవత్సరాల సంతోష్ సేథీ చెప్పారు. వీరిద్దరూ ముంబయిలో ఒక నిర్మాణంలో ఉన్న ప్రదేశం దగ్గర పని చేస్తున్న 17 మంది కార్మికులలో భాగంగా ఉన్నారు. గత ఏడాది మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించేటప్పటికీ వారి దగ్గర డబ్బులు, ఆహారం లేవు. వారు పని చేసే కాంట్రాక్టర్ వారికి కేవలం 1000 రూపాయిలు ఇచ్చారు. కానీ, అవి ఒక వారం రోజుల కంటే ఎక్కువ రోజులకు తినడానికి సరిపోవు.

 
ఆ సమయంలో బయటకు వెళితే పోలీసుల చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుందేమోననే భయంతో బయటకు వెళ్లడం కూడా కుదిరేది కాదు. వారి కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఒకసారి ఏడ్చేశారు. అన్నిటి కంటే ఆకలి పెద్ద సమస్య. "మేము చాలా సార్లు ఆకలితో ఉండేవాళ్ళం. రోజుకొకసారి మాత్రమే తినేవాళ్ళం. తిండి కోసం చేసే పోరాటం చాలా తీవ్రమైనది" అని 40 సంవత్సరాల టున్నాసేథీ అన్నారు.

తిండి కోసం వెతుక్కుంటూ ఈ ఇద్దరు అన్నదమ్ములు వలస కార్మికులకు, ఇల్లు లేనివారికి భోజనం అందిస్తున్న ఒక స్వచ్చంద సంస్థకు చెందిన వ్యక్తులను కలిశారు. ఖానా చాహియే (భోజనం కావాలా) అనే స్వచ్చంద సంస్థ సేథీస్ లాంటి 6,00,000 మంది వలస కార్మికులకు, ఆకలితో ఉన్నవారికి లాక్ డౌన్ సమయంలో 40.5 లక్షల భోజనాలను సరఫరా చేసింది. "వారంతా మా దగ్గరకు వచ్చి వారి కుటుంబాలను తిరిగి చూడలేమేమో, ఆకలితో ఇక్కడే చనిపోతామేమో అని అంటూ ఉండేవారు. సేథీస్ కూడా మా దగ్గరకు భోజనం కోసమే వెతుక్కుంటూ వచ్చారు." అని సోషల్ వర్కర్ సుజాత సావంత్ చెప్పారు.

 
సావంత్ వలస కార్మికులకు ఇవ్వడం కోసం తమ సంస్థ తరపు నుంచి నిత్యావసరాల కిట్ కూడా సరఫరా చేసేవారు. నగరంలో చాలా మంది భవన నిర్మాణ సంస్థల యజమానులు, కాంట్రాక్టర్లు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి వారి దగ్గర పని చేసే కార్మికుల బాగోగులు పట్టించుకోలేదని సావంత్ చెప్పారు. కొంతమంది కార్మికులు స్నానానికి సబ్బు కావాలని అడగడానికి వస్తే, పబ్లిక్ టాయిలెట్‌కి వెళ్ళడానికి డబ్బులు లేక మూడు రోజుల నుంచి టాయిలెట్‌కి వెళ్లలేకపోయానని మరొకరు వచ్చారని ఆమె చెప్పారు.

 
స్వచ్చంద సంస్థలు సరఫరా చేసే ఆహార పదార్ధాల ప్యాకెట్లపై రాజకీయ నాయకులు వారి ఫోటోలను ముద్రించుకునేవారని ఆమె అన్నారు. అలాగే, ఓట్లు తమకు రావనే ప్రాంతాల్లో సరుకులు సరఫరా చేసేవారు కాదని ఆమె చెప్పారు. ఈ ఆకలి రాజకీయాలు చేస్తున్న పనులను మరింత జటిలం చేశాయి. ఆఖరికి ఆహారం పంచుతున్నప్పుడు కూడా ప్రజలపై మత పరమైన, లింగ, భాష, కుల వివక్ష చూపించడాన్ని చూసామని ఖానా చాహియే సంస్థకు చెందిన నీరజ్ సేత్యే చెప్పారు.

 
రెండు నెలల పాటు ముంబయి నగరంలో అష్టకష్టాలు పడ్డ తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు వలస కార్మికుల కోసం కొంత మంది న్యాయవాదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ విమానంలో ఇంటికి ప్రయాణమయ్యారు. వారు, ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరేటప్పటికి ఉదయం 8 అయింది. కానీ, అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో వారు సొంత ఊరు గంజాం వెళ్ళడానికి రవాణా గాని, తినడానికి తిండి కానీ మరో 5 గంటల వరకు దొరకలేదు.

 
"అధికారులు మమ్మల్ని కుక్కల్లా చూశారు. మేము వైరస్ ఉన్న ప్రదేశం నుంచి వచ్చామని అంటూ వారు మాకు బిస్కట్ ప్యాకెట్‌లు విసిరారు" అని టున్నా సేథీ చెప్పారు. అదే రోజు సాయంత్రం వారు గంజాం చేరుకున్నారు. కానీ, 14 రోజుల క్వారంటైన్ పూర్తయ్యేవరకు వారు వారి కుటుంబాలను కలవలేకపోయారు. ప్రభుత్వం వారికి 2000 రూపాయిలు ఇచ్చి వారి జీవితాలను తిరిగి మొదలుపెట్టమని చెప్పింది. కానీ, ఆ డబ్బులు త్వరలోనే కరిగిపోయాయి.

సేథీ ఐదుగురు అన్నదమ్ములు కలిపి ఒక ఎకరం భూమిని పంచుకుంటున్నారు. వారు పండించిన పంట అంతా ఇంట్లో అవసరాలకే సరిపోతుంది. కొన్ని రోజుల పాటు సంతోష్ సేథీ పొరుగు వారి పొలంలో రోజుకు 350 రూపాయిల కూలీకి పని చేసారు. కొంత మంది వలస కార్మికులు ప్రభుత్వ రహదారి నిర్మాణ పనులకు వెళ్లారు. ఇలా నెలలు గడిచిపోయాయి, గత జనవరి నెలలో సేథీ అన్నదమ్ములకు వారి కాంట్రాక్టర్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అప్పటికి మహమ్మారి తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించింది.

 
నిర్మాణ రంగ పనులు నెమ్మదిగా మొదలయ్యాయి. ఈ ఇద్దరు అన్నదమ్ములు తిరిగి ఒక కిక్కిరిసిన రైలు ఎక్కి ముంబయి ప్రయాణమయ్యారు. ముంబయి నగర శివార్లలో నిర్మిస్తున్న 16 అంతస్థుల భవనంలో వారికి పని దొరికింది. ఒక కాంట్రాక్టర్ వారికి గత సంవత్సరం ఇవ్వవలసిన బకాయిలు ఇంకా ఉన్నాయి. వారి రోజు కూలీలు ఏమి పెరగలేదు. కానీ, వారికి మరో మార్గం లేదు. వారు మళ్ళీ ఇంటికి డబ్బు పంపడం మొదలుపెట్టారు. వీరు సంపాదించిన దానితో వాళ్ళ పిల్లల స్కూలు ఫీజులు, తల్లి తండ్రుల మందులు, రేకుల కప్పుతో ఉన్న ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు.

 
ముంబయి నగరంలో విధిస్తున్న నిబంధనల వల్ల మళ్ళీ నిస్సహాయంగా ఉన్నారా అని నేనడిగినప్పుడు, "మా గురించి ఎవరూ పట్టించుకోరు. నాకు కాంట్రాక్టర్ దగ్గర నుంచి రావల్సిన బకాయిలు నాకు తిరిగి ఇప్పించగలరా?" అని టున్నా సేథీ నన్నడిగారు. "నాకు మధుమేహం ఉంది. నేను మందులు కొనుక్కోవాలి నాకు ఎక్కువ ఖర్చులు ఉంటాయి" అని ఆయన అన్నారు.

 
వారి ప్రపంచం అంతా ఆందోళన, అనిశ్చితితో నిండిపోయింది. అన్నిటి కన్నా ముఖ్యంగా ఆకలి భయం వారిని ఎక్కువ చుట్టుముడుతోంది. "మాకు భయంగా ఉంది. గత సంవత్సరంలా మళ్ళీ జరగదు కదా? అలా జరిగితే మేము ఇంటికి తిరిగి వెళ్ళడానికి మీరే సహాయం చేయాలి".

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు