కరోనా వైరస్ నుంచి విముక్తి పొందిన వృద్ధ దంపతులు.. ఎక్కడ?

మంగళవారం, 31 మార్చి 2020 (16:57 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వృద్ధులకు సోకితే ఇక ప్రాణాలపై ఆశలు వదిలు కోవాల్సిందేనని ప్రతి ఒక్కరూ చెబుతూ వచ్చారు. కానీ, కేరళ రాష్ట్రానికి చెందిన 93 యేళ్ళ వృద్ధుడు, 88 యేళ్ళ వృద్ధురాలి మాత్రం కరోనా మహమ్మారిని జయించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. బీపీ, షుగ‌ర్‌తో పాటు ఇత‌ర స‌మ‌స్య‌లున్నప్పటికీ ఆ వృద్ధ దంపతులు ఈ వైరస్ నుంచి విముక్తి పొందారని పేర్కొంది. 
కేర‌ళ రాష్ట్రంలోని ప‌త‌నంతిట్ట జిల్లా రాన్ని ప్రాంతానికి చెందిన వృద్ద దంప‌తుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. అయితే ఇటీవ‌లే ఇట‌లీకి వెళ్లివ‌చ్చిన ఆ దంప‌తులు... త‌మ కుమారుడితో క‌లిసి భారత్‌కు తిరిగివ‌చ్చినట్లు అధికారులు గుర్తించారు. త‌ర్వాత వీరితో పాటు కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందింది. 
 
దీంతో వారిని కొట్టాయం మెడికల్ కాలేజీలో ఉంచి చికిత్స అందించారు. వైద్యులు ఇచ్చిన స‌లహాలు క్ర‌మం త‌ప్ప‌కుండా పాటించ‌డంతో వీరు ప్రాణాప్రాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని వైద్యులు తెలిపారు. మొత్తానికి మాన‌సికంగా ధృడంగా ఉంటే ఎంత‌టి మ‌హ‌మ్మారినైనా ఎదిరించ‌వ‌చ్చ‌ని ఈ వృద్ధ దంపతులు ప్రపంచానికి చాటిచెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు