చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తు చేసింది. దీంతో ఈ టోర్నీలో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. కంగారులు నిర్దేశించిన 264 పరుగుల విజయలక్ష్యాన్ని 48.1 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోమారు బ్యాట్‌తో రాణించాడు. మొత్తం 98 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి కోహ్లి ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఆడమ్ జంపా బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరాగాడు. దీంతో భారత అభిమానులు ఒకింత నిరాశకు లోనయ్యారు. మ్యాచ్ అనంతరం ఇదే అంశంహై కోహ్లి స్పందించారు.
తాను మైలురాళ్ల గురించి ఆలోచన చేయను. సెంచరీ కంటే జట్టు విజయం ముఖ్యమన్నారు. నేనెపుడూ అటువంటి వాటిపై దృష్టిపెట్టలేదు. వాటి గురించి పట్టించుకోకుంటేనే అవి జరుగుతాయి. ఒకవేళ నేను సెంచరీ చేసుంటే మంచిదే. కానీ, జట్టు విజయం అంతకంటే ముఖ్యం అని కోహ్లి వినమ్రయంగా చెప్పారు. వన్డేల్లో వయసు పెరిగే కొద్దీ మెరగువుతున్నార్ అనే ప్రశ్నకు కోహ్లి సమాధానమిస్తూ, నాకు తెలియదు.. మీరే చెప్పాలి అంటూ చెప్పారు.
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధికంగా 50కు పైగా పరుగులు చేసిన రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో సచిన్ టెండూల్కర్‌పై ఉండేది. సచిన్ 23 సార్లు అర్థ సెంచరీ అంతకంటే ఎక్కువ పరుగులు చేయగా, ఇపుడు విరాట్ కోహ్లి 24 సార్లు చేశారు.
అలాగే, ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేసిన కోహ్లి మరో ప్రపంచ రికార్డు అందుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో వెయ్యి పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 1023 పరుగులు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (746) చేసిన భారత ఆటగాడిగా కూడా కోహ్లీ నిలిచాడు.