పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్నావంటూ వేధింపులు.. భార్యను గొంతుపై కాలుతో తొక్కి చంపేసిన భర్త....

ఠాగూర్

బుధవారం, 22 మే 2024 (08:24 IST)
పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నానంటూ నిత్యం అనుమానిస్తూ వేధిస్తూ, గొడవలకు దిగుతున్న కట్టుకున్న భార్యను ఓ భర్త చంపేశాడు. గొంతుపై కాలుతో తొక్కి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకు కాలనీలో జరిగింది. స్థానిక పోలీసుల కథనం మేరకు... 
 
జనగామ జిల్లాలోని లింగంపల్లికి చెందిన భూక్య రమేష్‌కు గత 2016లో సిద్ధిపేటకు చెందిన కమల(29) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు రిషిక(7), రోహిత్(4) ఉన్నారు. కొన్నేళ్లుగా వారు ఉప్పల్‌లోని బ్యాంకు కాలనీలో నివాసం ఉంటూ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్‌లో పని చేస్తున్నారు.
 
అయితే, తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నడనే అనుమానం భార్యకు కలిగింది. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్లలు వేసవి సెలవులకు జనగామలోని వారి నాన్నమ్మ ఇంటికి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం కమల, రమేష్‌ల మధ్య మరోమారు గొడవ జరిగింది. 
 
ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి రాత్రి తిరిగి ఇంటికి వచ్చారు. మరోసారి వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా కమలపై రమేష్ దాడి చేసే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దాంతో అతడు ఆమె గొంతుపై కాలును బలంగా తొక్కిపెట్టి ప్రాణం పోయేంత వరకు అలాగే ఉంచాడు. కమల చనిపోయాక అర్థరాత్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
కమల హత్యలో రమేష్‌తో పాటు అతడి తల్లిదండ్రులు, వదిన ప్రమేయం కూడా ఉందని మృతురాలి బంధువులు ఆరోపించారు. వారందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. అందరిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు