తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి తన చిన్నమ్మే కారణమని ఓ వ్యక్తి గుడ్డిగా నమ్మేశాడు. దీంతో చిన్నమ్మపై పగ పెంచుకున్నాడు. ఆమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు అదను కోసం వేచి చూశాడు. ఈ క్రమంలో తన కుమారుడుతో కలిసి చిన్నమ్మను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలు చేశాడు. ఆ తర్వాత గోనె సంచుల్లో మూటగట్టి వేర్వేరు కాల్వల్లో పడేశాడు. ఈ దారుణం ఏపీలోని విజయవాడ నగరంలోని భవానీపురంలో జరిగింది. ఆలస్యంగా వచ్చిన ఈ దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే,
భవానీపురం ఉర్మిళా నగర్‌కు చెందిన పొత్తూరి విజయలక్ష్మి (65) తన కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. ఆమె అక్క కొడుకైన వంకధార సుబ్రహ్మణ్యం తన భార్య హారికతో విభేదాల కారణంగా 2012 నుంచి దూరంగా ఉంటున్నాడు. భార్య ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడానికి తన చిన్నమ్మ విజయలక్ష్మీ కారణమని సుబ్రహ్మణ్యం బలంగా నమ్మాడు. అప్పటి నుంచి ఆమెపై పగతో రగిలిపోతున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఆమెతో ఎంతో మంచిగా మాట్లాడి నమ్మించి, తన బైకుపై భవానీపురంలోని హెచ్.ఎస్.బి. కాలనీలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఉన్న తన 16 ఏళ్ల కుమారుడితో కలిసి ఆమెపై దాడి చేశాడు. ఇంట్లోని పెద్ద కత్తితో విజయలక్ష్మి మెడ నరికి హత్య చేశారు. అనంతరం తండ్రీకొడుకులిద్దరూ కలిసి మృతదేహాన్ని నాలుగు భాగాలుగా చేసి, గోనె సంచుల్లో కుక్కి నగరంలోని వేర్వేరు మురుగు కాల్వల్లో పడేశారు.
విజయలక్ష్మి కనిపించకపోవడంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, సుబ్రహ్మణ్యం ఇంటి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. విజయలక్ష్మిని అతడే బైకుపై తీసుకెళ్లినట్లు గుర్తించి, తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం అంగీకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలో మైనర్ కుమారుడు భాగం కావడం స్థానికంగా కలకలం రేపింది.