పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు.. పాకిస్థాన్‌కు క్లాస్ పీకిన చైనా

గురువారం, 28 ఫిబ్రవరి 2019 (13:02 IST)
ఆపద సమయంలో చైనా తమకు అండగా నిలుస్తుందని పాకిస్థాన్ భావించింది. కానీ, భారత్, పాకిస్థాన్ దేశాల వివాదాల్లో తాము తలదూర్చబోమని డ్రాగన్ కంట్రీ మరోమారు నిరూపించింది. పైగా, పాకిస్థాన్‌కు క్లాస్ పీకింది. పిల్ల చేష్టలు చేయొద్దంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే చర్యలను చైనా సహించబోదని స్పష్టం చేసింది. చైనా స్పందనతో పాకిస్థాన్ ఖంగుతింది. 
 
నిజానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ భూభాగంలో ఉన్న బాలాకోట్‌పై భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించి ఉగ్రతండాలను నేలమట్టం చేసింది. ఈ దాడులను చైనాతో సహా ఒక్క దేశం ఖండించలేదు. పైగా, పాకిస్థాన్‌కు ఒక్క దేశం కూడా అండగా నిలబడలేదు. ఈ విషయాన్ని పాక్ మాజీ రాయబారి ఒకరు స్వయంగా వెల్లడించారు. 
 
ఇప్పుడు మరోసారి పాక్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. భారత ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకొచ్చి... భారత మిలిటరీ స్థావరాలపై దాడి యత్నించి విఫలమయ్యాయి. భారత వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పాక్ యుద్ధ విమానాలు తోకముడిచి వెనక్కి వెళ్లిపోయాయి. అదేసయమంలో పాక్‌కు చెందిన ఎఫ్-16 రకం యుద్ధ విమానాన్ని కూడా భారత్ కూల్చివేయగా, భారత్ పైలట్‌ను పాక్ సేనలు బందీగా పట్టుకున్నాయి.
 
ఈ పరిణామాలను వివరించేందుకు తమ మిత్రదేశంగా భావిస్తున్న చైనాకు వివరించేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ బుధవారం అర్థరాత్రి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యికి అత్యవసరంగా ఫోన్ చేశారు. అయితే చైనా స్పందన చూసి ఆయన షాక్ తిన్నారు. భారత గగనతలంలోకి పాక్ దూసుకెళ్లడాన్ని తప్పుబట్టేట్లుగా వాంగ్ యీ మాట్లాడారు. 
 
ముఖ్యంగా, అన్ని దేశాల సార్వభౌమాధికారం, సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని చైనా భావిస్తుందని ఖురేషీకి వాంగ్ స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే చర్యలను చైనా సహించబోదని కూడా ఈ సందర్భంగా ఖురేషీకి వాంగ్ స్పష్టంగా చెప్పినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు