రష్యాలోని వ్లాదివోత్సోక్ నగరం మాదే : కలకలం రేపిన చైనా ప్రకటన

శుక్రవారం, 3 జులై 2020 (08:49 IST)
చైనా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఇప్పటికే భారత్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు శాయశక్తులా కుట్రలు పన్నుతున్న చైనా.. తాజాగా రష్యాలోని వ్లాదివోత్సోక్ నగరం తమదేనంటూ ప్రకటించి కలకలం రేపింది. 
 
1860కి ముందు వ్లాదివోత్సోక్ నగరం తమదిగా ఉండేదని చైనా ప్రభుత్వ టీవీ ఛానెల్ సీజీటీఎన్‌ సంపాదకీయం ప్రకటించింది. అక్రమ ఒప్పందంతో వ్లాదివోత్సోక్ నగరాన్ని రష్యా ఆక్రమించుకుందని ఆరోపించింది. ఒకప్పుడు వ్లాదివోత్సోక్ నగరం హైషెన్‌వాయిగా పిలవబడేదని సీజీటీఎన్ చీఫ్ షెన్ షివై ట్వీట్ చేశారు.  
 
చైనాలో మీడియా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుంది. సీజీటీఎన్ అధికారికంగా చేసిన ఈ ప్రకటన దుమారం రేపనుంది. రష్యాతో అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దెబ్బతినే అవకాశాలున్నాయి. చైనా గూఢచర్యం విషయంలో రష్యా ఇప్పటికే కోపంగా ఉంది. 
 
గల్వాన్ లోయ ఘటనతో తలెత్తిన ఉద్రిక్తతలు సద్దుమణగకుండానే చైనా వ్లాదివోత్సోక్ నగరం తమదే అని చెప్పడం కొత్త వివాదానికి తెరలేపనుంది. ఈ ప్రకటన ఎంతవరకు దారితీస్తుందోనన్న సందేహాలు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు, భారత్‌కు రష్యా ఆయుధాలను పెద్ద ఎత్తున సరఫరా చేయడం చైనాకు నచ్చడం లేదు. రష్యా నుంచి భారత్ కొనే ఆయుధాలన్నీ తమపై ప్రయోగించేందుకే అని తెలిసి కూడా రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు