అమెజాన్ సీఈవో నుంచి మారడానికి ఇదే సరైన సమయం : జెఫ్ బెజోస్

బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (08:10 IST)
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా, ఇంతకాలం అమెజాన్ కనిపెట్టుకునివున్నాను... ఇపుడు ఆ పదవి నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. 
 
ఈ యేడాది చివరి నాటికి అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్నట్టు జెఫ్ బెజోస్ ప్రకటించారు. ఇప్పటివరకు అమెజాన్‌ను కనిపెట్టుకుంటూ వచ్చానని, ఇప్పుడీ పదవి నుంచి మారడానికి ఇదే సరైన సమయమని ఉద్యోగులకు రాసిన లేఖలో బెజోస్ వెల్లడించారు. 
 
పైగా, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి పదవి నుంచి తప్పుకుని  వెబ్ సర్వీసెస్ హెడ్ ఆండీ జెస్సీకి బాధ్యతలు అప్పగిస్తానని తెలిపారు. బెజోస్ తర్వాత అమెజాన్ పగ్గాలు చేపట్టనున్న ఆండీ జెస్సీ 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
 
ఇకపోతే, సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న జెఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. బెజోస్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్ షిప్, అమెజాన్ డే1 ఫండ్‌పై మరింత దృష్టి పెట్టనున్నట్టు బెజెస్ తెలిపారు.
 
కాగా, 27 ఏళ్ల క్రితం ఇంటర్నెట్‌లో పుస్తకాలు విక్రయించే ఉద్దేశంతో బెజోస్ అమెజాన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం బైజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు