'నేనొక ఎంపీని.. టోల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు' : బీజేపీ ఎంపీ

ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (12:53 IST)
‘నేనొక ఎంపీని. టోల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం నాకు లేదు. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా?’ ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ మహేంద్ర నాథ్ పాండే అంటూ టోల్‌ ప్లాజా సిబ్బందిని ప్రశ్నించారు. 
 
తాజాగా దీన్‌దయాల్‌ ధామ్‌లో నిర్వహించిన దీనదయాల్‌ ఉపాధ్యాయ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే తన అనుచరులతో భారీ కాన్వాయ్‌లో విచ్చేసిన ఆయన మార్గం మధ్యలో ఫిరోజాబాద్‌ వద్ద టోల్‌‌గేట్‌ ఫీజు చెల్లించకుండానే వచ్చేశారు. దీంతో విషయం తెలుసుకున్న మీడియా కార్యక్రమం అనంతరం ఈ వ్యవహారంపై మహేంద్రను ప్రశ్నించింది. 
 
అయితే ఊహించని ప్రశ్నకు బిత్తరపోయిన ఆయన ‘నేనొక ఎంపీని. టోల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం నాకు లేదు. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా?’ అంటూ వ్యాఖ్యానించారు. వెంటనే మీడియా ప్రతినిధులు.. మీరు పార్లమెంటేరియన్ కావొచ్చుగానీ, మీతో ప్రయాణించిన మిగతా వాళ్లు కాదుగా అనటంతో ఎంపీకి పట్టరాని కోపం వచ్చేసింది. 
 
ప్రస్తుతం తాను దీన్‌దయాళ్ ధామ్ వద్ద ఉన్నానని.. కార్యక్రమానికి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉంటే అడగండంటూ కాస్త అసహనంగానే ఆయన మాట్లాడారు. కానీ, తమకు ఆ ప్రశ్నకే సమాధానం కావాలని మీడియా పట్టుబట్టడంతో... అది తప్ప మరేదైనా అడగండి అంటూ మహేంద్ర కోరారు. గతంలో అఖిలేష్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బారాబంకీ వద్ద ఫీజు చెల్లించకుండానే 175 కార్లతో టోల్‌ గేట్‌ దాటి వెళ్లిపోగా, అఖిలేష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే. 

 

#WATCH: When asked why he did not pay toll tax, UP BJP Chief Mahendra Nath Pandey says, "Main saansad (MP) hu aur main toll free hu." pic.twitter.com/mmihFDY3Tr

— ANI UP (@ANINewsUP) September 17, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు