వాట్సాప్ ద్వారా కాన్పు చేసిన నర్సులు.. ఐసీయూలో శిశువు..

శుక్రవారం, 7 జూన్ 2019 (11:44 IST)
సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై అంతా ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ వుంటే చాలు ప్రపంచమే తమ చేతుల్లో వుందనే భావన అందరికీ వచ్చేస్తుంది. స్మార్ట్‌ఫోన్, వాట్సాప్‌ను ఉపయోగించి.. ఎన్నెన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. తాజాగా ఓ వైద్యుడు వాట్సాప్ ద్వారా డేటాను షేర్ చేసుకుని.. నర్సుల సాయంతో ఓ మహిళకు కాన్పు చూడటం ప్రస్తుతం సంచలనానికి దారి తీసింది. 
 
ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు వైద్యుడు కాన్పు చూసిన ప్రైవేట్ ఆస్పత్రిని మహిళ బంధువులు చుట్టుముట్టారు. ఈ ఘటన తమిళనాడు, కోయంబత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోవై, రత్నపురిలోని సంబత్ వీధిలో నివసిస్తున్న రంగరాజ్.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య నిత్య (23) గర్భదాల్చింది. 
 
ఈ నేపథ్యంలో జూన్ 3వ తేదీ నిత్య చెకప్ కోసం వెళ్లింది. ఆ సమయంలో ఆమెను పరీక్షించిన నర్సులు ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో నిత్యకు పాప పుట్టింది. కానీ కాసేపటికే శిశువు ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆ పసికందును వేరొక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ శిశువుకు ఐసీయూలో వుంచి చికిత్స చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నిత్యకు తప్పుడు విధానంలో ఆపరేషన్ చేయడం ద్వారానే శిశువు ఆరోగ్యం మందగించిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నిత్య మాట్లాడుతూ.. తాను ఆస్పత్రిలోని లేబర్ వార్డుకు వెళ్లినప్పుడు తనకు వైద్యులు ఆపరేషన్ చేయలేదని.. షాకింగ్ నిజం చెప్పింది. 
 
డాక్టర్‌కు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా సమాచారం అందుకుని నర్సులు తనకు వైద్యం చేశారని నిత్య చెప్పుకొచ్చింది. కానీ నిత్య ఆరోపణలను వైద్యులు ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు