జగన్ గెలుపు పాపంలో నాకూ భాగస్వామ్యం ఉంది : మోత్కుపల్లి నర్సింహులు

ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (12:30 IST)
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు పాపంలో తనకు కూడా భాగస్వామ్యం ఉందని తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తంచేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై మోత్కుపల్లి స్పందించారు. 
 
చంద్రబాబు అరెస్టు రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంపై 2021లో కేసు నమోదైతే.. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని నాలుగేళ్ల తర్వాత అరెస్టు చేయించిన ఘనత ఏపీ సీఎం జగదేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్షకు దిగారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయన నిరసన దీక్ష కొనసాగనుంది.
 
ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జగన్‌.. నిన్ను, నీ విధానాలను చూసి ప్రజలు నవ్వుతున్నారు. వచ్చిన అధికారాన్ని కాపాడుకోలేని అసమర్థుడివి. ప్రజలు నిన్ను ఛీత్కరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నియంత అని పేరు తెచ్చుకున్నావు. చంద్రబాబును అరెస్టు చేసి ఏం ఆనందం పొందారో అర్థం కావడం లేదు. నారా భువనేశ్వరి ఏడుపు జగన్‌కు తగులుతుంది. 
 
ఎదుటి వారిని ఇబ్బంది పెడితే జగన్‌కే నష్టం. రానున్న రోజుల్లో 4 సీట్లు కూడా వైకాపాకు రావు. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో కూడా భాగం ఇవ్వకుండా బయటకు పంపారు. జగన్‌ గెలుపు పాపంలో నాకూ భాగస్వామ్యం ఉందని బాధపడుతున్నా. ఆయన కళ్లకు అహంకార పొరలు కమ్ముకున్నాయి. సొంత బాబాయ్‌ని చంపిన నేరస్థుడిని పట్టుకోలేని జగన్‌ ఎలాంటి నాయకుడు? నేను జగన్‌కు వ్యతిరేకం కాదు.. ఆయన దుర్మార్గానికి వ్యతిరేకం' అని మోత్కుపల్లి అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు