యువరత్న నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కేఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "జై సింహ". ఇది బాలయ్య బాబుకి 102వ చిత్రం. ఈ చిత్రాన్ని సికే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు.
"దాన వీర శూరకర్ణ నరసింహుడు" వచ్చాడు అంటూ మోషన్ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తుంటుంది. బాలయ్య లుక్ మాత్రం ఈ చిత్రంలో అదిరిందని అంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తుండగా, ఆయన సరసన నయనతార, హరిప్రియ, నటాషా దోషిలు కథానాయికలుగా నటిస్తున్నారు.
సింహా సెంటిమెంట్ బాలయ్యకి కలిసొస్తుండడంతో ఈ మూవీకి కూడా సింహ అనే పదాన్ని తగిలించి 'జై సింహా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్‌లో బాలయ్య కర్ర పట్టి వీరావేశంతో కనిపిస్తుండగా, పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తుంది. విగ్రహం ముందు కొందరు ధర్నా చేస్తున్నట్టు కూడా మనం గమనించవచ్చు. అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గురించి ఏదైన ప్రస్తావన ఉంటుందన్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.