నాలుగేళ్ల బుడ్డోడు 40 నిముషాల్లో తిరుమల కొండెక్కాడా...!?

మంగళవారం, 20 ఆగస్టు 2019 (13:23 IST)
కేవలం 40 నిమిషాల్లో తిరుమల కొండ ఎక్కడం అంటే ఎవరికైనా సాధ్యమేనా? సాధారణంగా శారీరక దారుఢ్యం బాగున్నవాళ్లు కూడా కనీసం రెండు గంటల సమయమైనా ఇందుకు తీసుకుంటారు. కానీ, నాలుగేళ్ల బాలుడు కేవలం 40 నిమిషాల్లోనే మొత్తం నడకదారి మార్గాన్ని అధిగమించి కొండపైకి చేరుకున్నాడు. దీంతో అక్కడున్న అధికారులు, భక్తులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. 
 
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరుకు చెందిన ఎస్.తోనేశ్వర్ సత్య అనే నాలుగేళ్ల బాలుడు తన పుట్టిన రోజైన ఆగస్టు 13వ తేదీ బుధవారం ఈ ఫీట్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మూడున్నరేళ్ల వయసు నుంచి సత్య తిరుమల మెట్ల మార్గం ఎక్కడం మొదలుపెట్టాడు. తొలిసారి తన తండ్రి సాయిబాబుతో వచ్చినప్పుడు ఎత్తుకుంటామన్నా వినకుండా దిగి మెట్లు ఎక్కడంతో తల్లిదండ్రులు ఇది దైవకృపగా భావించి అప్పటినుంచి ప్రతి నెలా తీసుకురావడం మొదలుపెట్టారు. 
 
తొలిసారి రెండు గంటల 20 నిమిషాల్లో కొండ ఎక్కిన సత్య, అప్పటి నుంచి వరుసగా సమయం తగ్గించుకుంటూ వచ్చి, ఈసారి కేవలం 40 నిమిషాల 20 సెకన్లలోనే మెట్లమార్గం ఎక్కేశాడు. మంచి వయసులో ఉన్నవాళ్లయితే రెండు నుంచి రెండున్నర గంటలు, కాస్త వయసు మీద పడినవాళ్లయితే నాలుగు గంటల్లో తిరుమల కొండ ఎక్కడం సర్వ సాధారణం. అలాంటిది ఒక్క గంట కూడా సమయం తీసుకోకుండానే ఈ బుడతడు కొండ ఎక్కేయడంతో ఇదంతా స్వామివారి మహత్యమేనని అక్కడి భక్తులు అనుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు