రాజ్యసభకు 12 మంది సభ్యుల ఏకగ్రీవం... పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీయే కూటమి!

ఠాగూర్

బుధవారం, 28 ఆగస్టు 2024 (09:26 IST)
రాజ్యసభకు 12 మంది కొత్త సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో అధికార కూటమి మెజార్టీ మార్క్‌ను విజయవంతంగా దాటేసింది. 
 
రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా, ప్రస్తుతం 8 ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థానాల్లో నాలుగు జమ్మూకాశ్మీర్, మరో నాలుగు నామినేటెడ్ స్థానాలు ఉన్నాయి. అయితే, ఇటీవల కొత్త సభ్యుల ఎన్నిక తర్వాత ఖాళీగా ఉన్న 8 స్థానాలు మినహాయిస్తే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 237కు చేరింది. ఇక మెజార్టీ మార్కు 119గా ఉంది. కొత్త సభ్యుల ఎన్నికతో ఎన్డీయే ఈ మ్యాజిక్ సంఖ్యను అధికమించింది. ప్రస్తుతం ఎన్డీయే సభ్యుల సంఖ్య 121కు చేరుకుంది. 
 
దీంతో పార్లమెంట్ ఎగువ సభలో బిల్లులను ఆమోదించుకునేందుకు ఎన్డీయే కూటమికి మార్గం సుగమం అయింది. కీలక చట్టాలు చేసే బలాన్ని అందిపుచ్చుకుంది. కాగా, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 9 మంది సభ్యులను బీజేపీ ఏకగ్రీవంగా గెలిపించుకుంది. దీంతో సభలో బీజేపీ సంఖ్యాబలం 96కు చేరింది. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీయే బలం 121గాను, ప్రతిపక్షాల బలం 85గా చేరుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు