పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానుక.. ఏంటది?

ఠాగూర్

శుక్రవారం, 30 ఆగస్టు 2024 (09:21 IST)
పిఠాపురం మహిళలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన కానుక ఇవ్వనున్నారు. మహిళలకు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ శుక్రవారం రోజును పురస్కరించుకుని వారికి పసుపు, కుంకమతో పాటు చీరను అందజేయనున్నారు. అలాగే, శ్రావణమాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనే మహిళలకు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత డబ్బులతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు అందజేయాలని నిర్ణయించారు.
 
పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పవన్ కల్యాణ్ పసుపు కుంకుమ కానుక పేరిట ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాగుల్లో చీరతో పాటు పసుపు, కుంకుమలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లు రెండు రోజులుగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని జనసేనాని నివాసంలో జరుగుతున్నాయి. 
 
దీంతో వ్రతాల్లో పాల్గొనే మహిళలు టోకెన్లు తీసుకునేందుకు గురువారం పాదగయ క్షేత్రానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటలకు కేవలం 2 వేల మందికే టోకెన్లు ఇచ్చారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు విడతలుగా 6 వేల మందితో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ దుర్గభవాని చెప్పారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు