21 యేళ్ళకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్

శుక్రవారం, 15 నవంబరు 2024 (08:55 IST)
దేశ యువత 21 యేళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. గతంలో ఓటు హక్కు 21 ఏళ్లకు ఇచ్చేవారని, తమ మహానేత, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దానిని 18 ఏళ్లకు తగ్గించారని, అలాగే 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రావాలని కోరారు. ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...  ప్రజా విజయోత్సవాల్లో పాల్గొనాలని పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను ఆహ్వానించినట్టు చెప్పారు. అదేవిధంగ శాసన సభ సమావేశాల్లో 21 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు. దీనిని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేద్దామన్నారు. 21 సంవత్సరాలు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్లు అవుతూ... జిల్లాలను నడుపుతున్నారని పేర్కొన్నారు. అదే యువకులు ఎమ్మెల్యేలుగా రాణిస్తారనే విశ్వాసం తనకు ఉందన్నారు.
 
హాస్టళ్లలో చదివే విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. నాసిరకం భోజనం పెట్టినా... నాసిరకం ఆహారం సరఫరా చేసినా... కనీసం అలా చేయాలనే ఆలోచన వచ్చినా సహించేది లేదన్నారు. అలాంటి వారిని జైల్లో పెడతామని హెచ్చరించారు. నాసిరకం భోజనం వల్ల హాస్టల్ విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు