కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

ఠాగూర్

బుధవారం, 1 జనవరి 2025 (22:52 IST)
కొత్త సంవత్సరం రోజున ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు మరింత చేరువగా గడిపారు. ఈ ఒక్క రోజునే ఆయన ఏకంగా రెండు వేల మందిని కలిసి వారి చెప్పిన విషెస్‌ను స్వీకరించి ఫోటోలు దిగారు. అలాగే, కొత్త సంవత్సరం తొలి రోజున 600 మంది పేదలకు ఉపయోగపడే రూ.24కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల ఫైలుపై సంతకం చేసి తన కొత్త సంవత్సర రోజును ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత బుధవారం ఉదయం 10.45 గంటలకు తితిదే అర్చకులతో ఆశీర్వాదం తీసుకున్నారు. 
 
ఉదయం 11 గంటలకు నుంచి తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన ముఖ్య ఉన్నతాధికారులను కలిశారు. మధ్యాహ్నం 12.20 గంటల తర్వాత విజయవాడ దుర్గగుడిలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, వివిధ అంశాలపై చర్చించారు. 
 
మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ తర్వాత 3.15 గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సీఎం బాబు అక్కడ 1500 మందితో పార్టీ కార్యాలయంలో ఫోటోలు దిగారు. తనను కలిసిన ప్రతి ఒక్కరి నుంచి విషెస్ స్వీకరించారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సచివాలయానికి వచ్చారు. అక్కడ సీఎంవో అధికారులతో సమావేశమై, సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో గంటపాటు సమావేశమయ్యారు. తన మనసులోని ఆలోచనలు చెప్పి, వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. 
 
రాత్రి 7.15 గంటల తర్వాత గురువారం జరగాల్సిన మంత్రివర్గ అజెండాపై సీఎంవో అధికారులతో చర్చించి, మరి కొంత మంది నేతలను సచివాలయంలోనే కలిశారు. అనంతరం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. కాగా, గురువారం సీఎం బాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు