ఈ సమ్మె ప్రభావం కారణంగా.. ఆంధ్రాలోని పలు విమానాశ్రయాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాల్లో టికెట్ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముంబై నుంచి హైదరాబాద్‌కు గురువారం విమానం టికెట్ ధర కనిష్టంగా రూ.2,177, గరిష్టంగా రూ.3 వేలుగా ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమాన చార్జీలు కూడా రూ.4 వేలకు అటూఇటుగా ఉన్నాయి.
అయితే, ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఫ్లైట్లలో టికెట్ ధరలు వింటే మాత్రం కళ్లు బైర్లుకమ్మాల్సిందే. అక్షరాలా పాతిక వేలు. ఒక్క రాజమహేంద్రవరమే కాదు.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాల ధరలు చుక్కలనంటుతున్నాయి.
దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన ప్రయాణికులు.. తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే రైళ్లలో బెర్త్‌లన్నీ నిండిపోవడం.. వెయిటింగ్ లిస్టు భారీగా ఉండటం.. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో.. డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో గురువారం విమాన చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
గురువారం విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాలు కిటకిటలాడాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరిన ఓ విమానంలో చార్జీ అత్యధికంగా రూ.25,228గా నమోదైంది. విజయవాడ-హైదరాబాద్ సర్వీసుల ధరలూ మోతమోగాయి. సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరిన విమానంలో టికెట్ ధర రూ.18,886గా పలికింది. విశాఖ-హైదరాబాద్ మధ్య విమానం టికెట్ ధర రూ.12 వేలుగా నమోదైంది. తిరుపతి-హైదరాబాద్ విమానాల్లో అత్యధికంగా రూ.8 వేల వరకు పలికింది.