రోగులు ప్రాణాలను రక్షించాల్సిన అంబులెన్స్ డ్రైవర్లు కూడా కామాంధులై పోతున్నారు. ఆపదలో ఉన్న రోగులను ఆస్పత్రులకు చేర్చాల్సిన అంబులెన్స్ డ్రైవర్.. ఓ రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ రోగి సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్న యువతి కాదు. కరోనా వైరస్ సోకి ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కామాంధుడుకి కేరళ కోర్టు ఒకటి జైలుశిక్ష విధించింది.
గత 2020 సెప్టెంబరు 5వ తేదీన జరిగిన ఈ అమానుష ఘటన వివరాలను పరిశీలిస్తే, కరోనా సోకిన 19 యేళ్ల యువతిని అంబులెన్స్‍లో తరలిస్తూ నిర్మానుష్య ప్రాంతంలో వాహనాన్ని అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్ ఆపాడు. కరోనా రోగి అనే కనికరం కూడా లేకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. తప్పు జరిగిపోయిందని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాధితురాలిని నౌఫాల్ ప్రాధేయపడ్డాడు. అయితే, అదే రోజున కోవిడ్ సెంటరులోని అధికారులకు బాధితురాలు తనపై జరిగిన అత్యాచారంపై సమాచారం అందించింది. ఈ విషయాన్ని కోవిడ్ సెంటర్ అధికారులు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, వారు నిమిషాల వ్యవధిలోనే నిందితుడుని అరెస్టు చేశారు. ఆ తర్వాత నౌఫాల్‌పై అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
కాగా, నౌఫాల్ గతంలో కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసును విచారించిన పట్టణమిట్ట ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు శనివారం సాయంత్రం సంచలన తీర్పును వెలువరించింది. నౌఫాల్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు రూ.1.08 లక్షల అపరాధం కూడా విధించింది.